విచిత్ర కవలలు 1వ భాగం – దినదిన గండం

కొన్నివేల సంవత్సరాల క్రిందట, శ్రావస్తి నగరాన్ని దానశీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి  దానశీలుడే గొప్ప. ఏమంటే లక్షలకొలది  సైన్యం వుంది, దాసదాసీ జనాలకు లెక్కలేదు. ఇక ఆరాజు ధనాగారం రత్నాలు, మొహరీలు, వజ్రాలు  వైడూర్యాలు మొదలయిన అన్నిరకాల వెలలేని మణులతోనూ వెండి, బంగారు ధనరాసులతోనూ నిండివుండేది. అన్నిటినీ మించిన అదృష్టం అనుకూలవతి, అపురూపసౌందర్యరాశి ఐన ‘కాంతిరేఖ’ రాజుకి రాణి కావటమే. మరో గొప్ప విషయం వీమిటీ అంటే  ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్నా ఆ రాజుకి ఏకోశానా గర్వం అనేది లేదు, బీదసాదలంటే  రాజుకి ఎంతో దయ. దైవభక్తికూడా ఆపారం. ఇక ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. “దేహి” అని వచ్చిన వాడికి ‘లేదు’ అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణంచేతనే రాజు ‘దానశీలుడు’ అనే తన పేరు  సార్థకపరుచుకున్నాడు.

ఇలా వుండగా కొన్నాళ్ళకు ఒక పెద్ద అవాంతరం వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతున్న రాణి కాంతిరేఖ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. రాజు కంటికిమింటికి ఏక  ధారగా ఏడ్చాడు. ప్రజల దుఃఖానికి అంతేలేదు. కాని ఎంత ఏడ్చి, చనిపోయిన రాణిని తిరిగి బ్రతికిరచటం ఎవరివల్ల అవుతుంది?

క్రమంగా రోజులు గడుస్తున్నకొద్దీ రాజూ, ప్రజలూకూడా చనిపోయిన రాణిని గురించి తలచటం మానివేశారు. ఇప్పుడు అందరికి ఒకే ఒక దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగక ముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం, రాజ్యం పరులపాలు కాకుండా వుండటానికి రాజు తిరిగి వివాహం చేసుకుని సంతానం పొందటం అవసరం. మంత్రులూ, సామంతులూ రాజుని తిరిగి వివాహం చేసుకోమన్నారు, రాజు ఒప్పుకోక తప్పిందికాదు. ఒక సుముహుర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కాని దురదృష్టమేమోకాని రెండవ భార్యకూడా కొద్దిరోజులకే ఆకస్మికంగా చనిపోయింది.

ఈ వార్త అరాజ్యంలో ప్రజలందరి నోటాపడి క్రమంగా చుట్టుప్రక్కల రాజ్యాలకికూడా పాకిపోయింది. మన్త్రులూ, సామంతులూ ఈసారికూడా రాజుని తిరిగి మూడోవివాహం చేనుకోమని వేడుకుని ఎలాగ్లెతేనేం రాజుచేత ఒప్పించగలిగారు. కాని రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్ళి అయిన కొద్దిరోజులకెల్లా చనిపోతూన్నదన్న వార్త విన్నతర్వాత ఏ తండ్రి చూస్తూ చూస్తూ తన బిడ్డని మృత్యుముఖంలోకి పంపటానికి ఒప్పుకోగలడు? రాజ వంశీయులుకాదు కదా, కడకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లని రాజుకి యివ్వటానిక ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులూ సామంతులూ దేశం నలుమూలలా యింకా వెతుకు తూనే వున్నారు.

అలా వెతకగా వెతకగా కొన్నాళ్ళకు, తన కుమార్తెను యివ్వటానికి ఒక పేదరాలు ఇప్పకొన్నది. ఆ పిల్ల బీద వంశంలో పుట్టినప్పటికీ, అందచందాలలో ఏ రాకుమార్తెకూ తీసిపోలేదు. అతిరూపసౌందర్యరాశి అయిన ఆ పిల్లని చూచి మంత్రులూ సామంతులూ ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకి అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతుందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు సరికదా ఎంతో సంతోషించి మంత్రులతో; “మృత్యుదేవతకి బీదలైనా ఒకటే, భాగ్యవంతులైనా ఒకటే, ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న నా రాణులను రక్షించ కోగలిగానా? బతికే యోగం వుంటే ఎవరైనా బ్రతుకుతారు. కనుక మీరు చూచి వచ్చిన ఆ స్త్రీని చేనుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు” అన్నాడు రాజు.

ఇది విన్న మంత్రులు ఉత్సాహ భరితులైనారు. మరి కొద్దిరోజులకల్లా మంచి ముహూర్తాన రాజుకీ ఆ పేదరాలి కూతురుకీ వివాహం ఏర్పాటుచేశారు.

వివాహం సలక్షణంగా జరిగే వరకూ ఎవరికి గుండె ధైర్యంలేదు. ఎందు వల్లనంటే అంతకుముందు రాజు వివాహం చేనుకున్న రాణీలుకూడా వివాహం అయిన తర్వాత ఒక వారం తిరక్కుండానే చనిపోయారు.

కాని ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరమూ లేకుండా గడిచిపోయినై. అప్పటికి రాజుకీ మంత్రులకీ ప్రజలకీ కొంత ధైర్యం చిక్కింది.

నాటినించీ ప్రజలు– “ఈ నాల్గవ భార్యవల్లనైనా మారాజుకి సంతానం ప్రసాదించు తండ్రీ” అని దేవుడిని ప్రార్ధించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడుకాబోలు, మరో నెలకల్లా రాణి గర్భవతి అయినట్లు వార్త పొక్కింది. ఈవార్త విన్న ప్రజల సంతోషానికి మేరలేక పోయింది, ఇక రాజు, అతని పరివారం నంగతి చెప్పేదేమిటి?

క్రమంగా నవమాసాలూ నిండి, మంచి నక్షత్రాన రాణి పద్మముఖి సుఖ ప్రసవమై ముగ్గురు కవలల్ని కన్నది, కాని తమ వంశోద్ధారకుడుగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు, పుట్టిన అ ముగ్గురు, కవలలూ ఆడపిల్లలే అని విన్నప్పుడు, కొంత నిస్పృహ చెందకపోలేదు. అయినా, రాజుతన నిస్పృహ పైకి ఏమాత్రం కనబరచలేదు. ‘నాకు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వీళ్లే” అనుకొని మనన్సు సమాధానపరచుకున్నాడు. ఏమైతేనేం ఆ ముగ్గురు కవలల్నీ రాజూ, రాణీ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

ముగ్గురు పిల్లలకూ తలిదండ్రులు వరసగా సుహాసిని, సుభాషిణి, నుకేశిని అని నామకరణం చేశారు. క్రమంగా ముగ్గురు పిల్లలూ, అ ఏటికా ఏడు పైబడినకొద్దీ, చక్కటి అందాల బరిణలుగా తయారవుతున్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూచినవాళ్ళు “ఒక్కొక కుమార్తె పదిమంది కొమాళ్ళ పెట్టు” అని మెచ్చుకొనేవారు.

ఇంతటి అనందంలోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజునీ, రాణినీ కంగారుపరుస్తుండేది. ముగ్గురు పిల్లలలోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక అపాయంలో చిక్కుకోవటం మళ్ళీ ఎలాగో తప్పుకోవటం జరుగుతూ ఉండేది

ఒకసారి సుహాసిని, తండితో తోటలో షికారు చేస్తుండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లని కాటువెయ్యటానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడేగాని లేకపోతే ఆ నాటితో నుహాసినికీ లోకానికీ బుణం తీరిపోయేదే.

మరొకసారి సుభాషిణి తల్లితో నది ఒడ్డుకి షికారుకు వెళ్ళింది. అంతవరకూ ప్రశాంతంగా వున్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిలుచున్న నుభాషిణిని లోపలికి ఈడ్చుకుపోయింది. దైవానుగ్రహంవల్ల సరీగా ఆ సమయానికి ఒక పల్లెకారి అచోటికి రావటం, రాణి కంగారు వడుతూవుండటం చూచి వాడు నదిలోదూకి ఎలాగైతేనేం సుభాషిణిని ప్రాణాలతో బైటికి తెచ్చి బతికించటం జరిగింది. ఆ పల్లెకారే అటు రాకపోతే నాటితో సుభాషిణి నది గర్భంలో కలిసి పోయివుండును.

ఇదేవిధంగా మరొకసారి మూడవ పిల్ల సుకేశిని ఒక గండం గడిచి బైట పడింది. ఆది యేమిటీ అంటే – ఒకరోజున నుభాషిణీ, సుహాసినీ, సుకేశినీ కలిసి తోటలో పూలు కోయటానికి వెళ్ళారు. ముగ్గురూ మూడు బుట్టల్లో పూలు కోసుకుని తిరిగి మేడకు బయలుదేరారు. ముందు నుభాషిణీ, అ పిల్లవెనక నుహాసినీ, ఆవెనక సుకేశినీ నడుస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సుకేశిిని కెవ్వున కేకపెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ హడిలి పోయి తల్లిదగ్గరకు పరుగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి, వాళ్ళని వెంట బెట్టుకుని సుకేశిని పడివున్న చోటికి వచ్చిచూడగా, పక్కనే పూలబుట్ట, ఆపూలలో పాకుతూవున్న ఒక మండ్రగబ్బ కనిపించినై. అప్పటికి తెలిసింది రాణకి మండ్రగబ్బ కుట్టటంవల్లనే నుకేశిని అలా పడివుంటుందని. దానినిచంపి ఆమె వెంటనే పిల్లని ఎత్తుకుని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురంపగా, ఆయన వచ్చి ఏదోమందు వేశాడు. కొంత సేపటికి తిరిగి సుకేశిని లేచి మాటాడసాగిండి.

ఇలా లేక లేక తమకు కలిగిన ఈ ముగ్గురు పిల్లలలో ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఎదో ఒక గండం రావటం చూచేసరికి రాజు మనస్సు పరి పరి విధాల పోయింది. ఆయన తహతహ లాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్కుణ్ణి పిలిపించి, తన కుమార్తెలు ముగ్గురి జాతకాలు చూపించాడు. జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా అలోచించి తర్వాత ఏమీచెప్పకుండా వూరుకొనేనరికి రాజు అరాటం మరింత హెచ్చింది. “ఏదో అనుమానిస్తున్నట్టున్నారే? ఉన్నదున్నట్లు చెప్పండి! నిజం వెల్లడిస్తారనే, వుద్దేశంతోనే మిమ్మల్నిరప్పించాను.” అంటూ అప్యాయత చూపి అన్నాడు జ్యోతిష్కుడి భుజం తట్టుతూ.

అప్పుడు జ్యోతిష్కుడు యిలా చెప్పాడు: “ఈ పిల్లలు చాల అంద చందాలతో వెలిగిపోతూ వుంటారు. అనాటి కానాటికీ వారి అందం వృద్ధిపొందుతుందేగాని తీసిపోదు. కాని విచారించవలసిన విషయం వీమిటీ అంటే, వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువవుతున్నది. వీరు పుట్టిన దగ్గిర్నుంచీ ఎప్పుడూ ఎదో ఒక గండం దాటవలసి వస్తూనే ఉండాలి…” అని ఆగాడు.

జ్యోతిష్కుడి నోటివెంట వచ్చిన ప్రతిఒక్క మాటకి రాజు గుండె తరుక్కుపోతోంది. ఆయన కంటివెంట ఏకథారగా కన్నీరు కారటంచూచి జ్యోతిష్కుడు మథ్యలో ఆగాడు, కాని రాజు, ఎంత కష్టానికైనా ఓర్చుకుని జాతకంలోని నిజా నిజాలు తెలపవలసిందని పట్టుబట్టాడు, అందుకని – “ఆగారేం? చెప్పండి” అని జ్యోతిష్కుణ్ణి హెచ్చరించాడు.

“నిజంచెప్పి మీ మనస్సు కష్టపెట్ట వలసి వచ్చిందే అని విచారిస్తున్నాను” అన్నాడు జ్యోతిష్కుడు.

“ఫరవాలేదు, చెప్పండి. నా చిట్టి తల్లుల్ని నాశాయశక్తులా రక్షించుకోవటానికి ప్రయత్నిస్తాను. మీరుమాత్రం ఉన్న సంగతి దాపరికంలేకుండా చెప్పండి” అని దైన్యావస్థలో అడిగాడు రాజు.

అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి యిలా చెప్పసాగాడు –

“మన అమ్మాయిలకు ఏడేళ్ళు నిండేవరకూ ‘దినదిన గండం నూరేళ్లాయున్సు’ అన్నట్టుగానే వుంటుంది. కాని, ఈ ఏడేళ్ళూ, గండాలన్నీ గడిచి బైటపడ్ధారంటే యిక మన అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు. కనుక ఏడేళ్లు నిండేవరకూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే, ఇంతకు మించి జాతకంలో చెప్పదగ్గ విశేషం లేదు” అని ముగించాడు జ్యోతిష్కుడు.

రాజు, జ్యోతిష్కుని అనేకవిథాల సత్కరించి పంపివేశాడు. తర్వాత రాణి దగ్గరకు వచ్చి, జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్ని చెప్పలేక చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు. వింటూవింటూ రాణీ స్పృహతప్పి పడిపోయింది.

దాసదాసీలు ఉపచారం చెయ్యగా కొంత సేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెని ఓదారున్తూవుండగా, పిల్లల్ని కాపాడుతున్న దాది పరుగెత్తుకుంటూవచ్చి “మన అమ్మాయిలు ముగ్గురూ స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో” అంటూ గొల్లున ఏడ్చింది. కంగారుపడుతూనే రాణి తోటవైపుకి పరుగెత్తింది. దాది ఆమె వెంట పడింది. ఆస్థాన వైద్యుడికి కబురుపంపారు. రాజుకూడా తోటవైపుకి పరుగెత్తాడు.

Appeared in Chandamama magazine July 1950 Edition.